: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

- భట్‌పల్లి గ్రామస్థులతో చాలా విషయాలు మాట్లాడానని వెల్లడి
- కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమయ్యాయని విమర్శ
- కాంగ్రెస్ పాలన దుర్గంధభరితమని విమర్శ
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఇప్పటికీ ప్రభుత్వానికి స్పష్టత లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం భట్‌పల్లి గ్రామంలో పర్యటించారు. అనంతరం గ్రామస్థులతో ఆయన మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.
గ్రామస్థులతో చాలా విషయాలు మాట్లాడానని, వారు షాకింగ్ విషయాలు చెప్పారని అన్నారు. పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమయ్యాయని, సర్పంచ్‌లు లేరని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేవని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్‌కు కూడా కష్టమవుతోందని రాసుకొచ్చారు.
డ్రైనేజీ కాలువల్లో నీరు నిలిచి ఊరంతా దుర్వాసన వస్తోందని అన్నారు. కేంద్రం, రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయని అన్నారు. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఇలాగే దుర్వాసన వస్తుందా? ఇలాగే చెత్త పేరుకుపోయిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన దుర్గంధభరితమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.