Rajanala:  కూతురు పెళ్లి చేయడానికి ఇబ్బందిపడిన రాజనాల!

Rajanala Special

  • 1950లలో ఇండస్ట్రీకి వెళ్లిన రాజనాల 
  • ఆయనకు 'కావలి' అంటే ఇష్టమన్న సన్నిహితులు
  • చివరి రోజుల్లో ఆర్ధికంగా ఇబ్బంది పడ్డారని వివరణ 
  • కూతురు పెళ్లి కోసం తోట అమ్మారని వెల్లడి   


రాజనాల... వెండితెరపై విరుగుడు లేని విలనిజాన్ని పండించిన నటుడు. 'కావలి' నుంచి 1950లలో ఇండస్ట్రీకి వచ్చిన రాజనాల, ఆ తరువాత తనని తాను నిరూపించుకుంటూ ముందుకువెళ్లారు. ఎన్నో సాంఘిక .. జానపద .. పౌరాణిక చిత్రాలలో తన మార్క్ నటనను చూపించారు. మంచి దేహ ధారుడ్యం .. గంభీరమైన వాయిస్ .. విలనిజాన్ని ఆవిష్కరించే నవ్వు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచేవి. అలాంటి రాజనాల 1998లో మరణించారు.

'ఊరు - వాడ' యూ ట్యూబ్ ఛానల్ కోసం 'కావలి'లోని రాజనాల సన్నిహితులు కొందరు, ఆయన గురించిన విషయాలను పంచుకున్నారు. "రాజనాలకి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. అదే ఆయనను సినిమాలలోకి తీసుకుని వెళ్లింది. సినిమాలలో ఆయన ఎంతగా ఎదిగినా 'కావలి'లోని స్నేహితులను ఎప్పుడూ మరిచిపోలేదు. మద్రాసు నుంచి వచ్చి అందరితో సరదాగా మాట్లాడి వెళుతూ ఉండేవారు. డబ్బు విషయంలో ఎంతో ఉదారంగానే ఉండేవారు" అని సన్నిహితులు చెప్పారు. 

'కావలి'లోని ఒక  సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ .. "ఒక రోజున హఠాత్తుగా ఆయన మా క్లినిక్ కి వచ్చారు. రాజనాల గారు మా క్లినిక్ కి రావడం ఏమిటా అని నేను ఆశ్చర్యపోయాను. అప్పట్లో ఆయనకి ఇక్కడ ఒక తోట ఉండేది. ఇప్పుడు కూడా ఆ ప్రదేశాన్ని 'రాజనాల తోట' అనే అంటారు. తన కూతురు పెళ్లి చేయడానికి తన దగ్గర డబ్బు లేదనీ, 'తోట' అమ్ముడు పోవడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.

అంతటి నటుడు అలా అనడం నాకు చాలా బాధగా అనిపించింది. అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినడాన్ని నేను గమనించాను. అప్పుడు నేను ఆయనకి 3 లక్షలు ఇచ్చాను. ఆ మరుసటి రోజునే తోటకు సంబంధించిన కాగితాలను ఆయన నాకు ఇచ్చారు. కూతురు పెళ్లి చేసిన తరువాత కూడా వాళ్లను తీసుకుని ఆయన 'కావలి' వచ్చారు. పుట్టి పెరిగిన ఊరు పట్ల ఆయనకి గల ప్రేమకు ఇదే నిదర్శనం" అని చెప్పారు. 

Rajanala
Telugu Actor
Kavali
Tollywood Veteran
Film Industry
Daughter's Marriage
Financial Difficulties
Legendary Villain
YouTube Channel
Uru-Vada
  • Loading...

More Telugu News