Vighnesh Puthur: విఘ్నేశ్‌తో ధోనీ మాట్లాడింది ఇదేన‌ట‌.... వారి సంభాష‌ణ‌ను బ‌య‌ట‌పెట్టిన మిత్రుడు!

Dhonis Encouraging Words to Vighnesh Puthur After Stellar IPL Debut

  • చెన్నైతో మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఎంఐ స్పిన్న‌ర్ విఘ్నేశ్ పుతుర్  
  • కీల‌క‌మైన 3 వికెట్లు తీసి ఆక‌ట్టుకున్న మ‌ణిక‌ట్టు స్పిన్న‌ర్‌
  • మ్యాచ్ చివ‌ర్లో యువ ఆట‌గాడిని ప్ర‌త్యేకంగా అభినందించిన ధోనీ
  • దాంతో యువ ఆట‌గాడికి ధోనీ ఏం చెప్పి ఉంటాడా అని నెటిజ‌న్ల ఆస‌క్తి
  • వారిద్ద‌రూ ఏం మాట్లాడుకున్న‌ది మీడియాకు చెప్పిన‌ విఘ్నేశ్ చిన్ననాటి మిత్రుడు శ్రీరాగ్

ఐపీఎల్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) లెగ్ స్పిన్న‌ర్ విఘ్నేశ్ పుతుర్ మంచి ప్రదర్శనతో అద‌రగొట్టాడు. నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూడు కీల‌క వికెట్లు తీశాడు. 24 ఏళ్ల ఈ మ‌ణిక‌ట్టు స్పిన్న‌ర్ చెన్నై కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివమ్ దూబె, దీపిక్ హూడాల‌ను పెవిలియన్ పంపాడు. 

దీంతో అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇలా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన విఘ్నేశ్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. సీఎస్‌కే మాజీ సార‌థి ఎంఎస్ ధోనీ కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్ అనంతరం అతడి భుజంపై చేయి వేసి మరి అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.    

దాంతో యువ ఆట‌గాడికి ధోనీ ఏం చెప్పి ఉంటాడా? అని నెటిజ‌న్లు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. చివ‌రికి ఈ విష‌యం విఘ్నేశ్ చిన్ననాటి మిత్రుడు శ్రీరాగ్ ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో విఘ్నేశ్‌కు ఎంఎస్‌డీ ఏం చెప్పాడ‌నేది తాజాగా శ్రీరాగ్ మీడియాతో తెలిపాడు. మ్యాచ్ త‌ర్వాతి రోజు శ్రీరాగ్‌... విఘ్నేశ్‌కు ఫోన్ చేసి ధోనీతో జ‌రిగిన సంభాష‌ణ గురించి అడిగాడు. 

"ధోనీ... విఘ్నేశ్‌ను నీ వ‌య‌సెంత? అని అడిగాడు. ఇక మీదట కూడా ఇదే ఆట‌తీరును కొన‌సాగించు అని అత‌డికి సూచించాడు" అని శ్రీరాగ్ మీడియాకు తెలిపాడు. ఈ సంద‌ర్భంగా కొన్నిరోజుల క్రితం త‌న స్నేహితుడు విఘ్నేశ్ పేరెంట్స్ తో జ‌రిగిన సంభాష‌ణ‌ను కూడా పంచుకున్నాడు. 

క్రికెట‌ర్ల‌కు చాలా త్వ‌ర‌గా పేరు, డ‌బ్బు వ‌స్తుంది. కానీ, ఎంత ఎదిగినా మూలాల‌ను మ‌రిచిపోకూడ‌దు... పృథ్వీషా, వినోద్ కాంబ్లీ విష‌యంలో ఏం జ‌రిగిందో మ‌నంద‌రికీ తెలిసిందే అని తాను వాళ్ల‌తో చ‌ర్చించిన‌ట్లు శ్రీరాగ్ పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News