Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా?

- ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి
- పంత్ విఫలం... అశుతోష్ మెరుపులు
- గోయెంకా-పంత్ వీడియోపై నెటిజన్ల కామెంట్లు
- ట్వీట్ తో వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేసిన లక్నో యజమాని
గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓ మ్యాచ్ లో ఓడిపోవడంతో, ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై బౌండరీ లైన్ వద్ద నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సంజీవ్ గోయెంకా ఎంతో ఆవేశంతో మాట్లాడినప్పటికీ, కేఎల్ రాహుల్ సంయమనం ప్రదర్శించడం ఆ వీడియోల్లో కనిపించింది.
ఇప్పుడు సీజన్ మారింది... లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ మారాడు... రిషబ్ పంత్ కొత్తగా సారథిగా వచ్చాడు. అయితే, గతరాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ లో మ్యాచ్ లో లక్నో అనూహ్యరీతిలో ఓడిపోయింది. కొత్త ఆటగాడు అశుతోష్ వర్మ చిచ్చరపిడుగులా చెలరేగి లక్నోకు విజయాన్ని దూరం చేశాడు.
ఈ మ్యాచ్ అనంతరం లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషబ్ పంత్ తో కాస్త ఎక్కువ సమయం పాటు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంత్ ఏదో వివరిస్తుంటే, గోయెంకా కూడా ఏదో చెబుతుండడం ఆ వీడియోలో కనిపించింది. దాంతో నెటిజన్లు... గతంలో రాహుల్ ను ఏకిపడేసినట్టే ఇప్పుడు పంత్ ను కూడా ఏకిపడేసినట్టున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. పంత్ నిన్నటి మ్యాచ్ లో డకౌట్ కావడంతో నెటిజన్ల కామెంట్లకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ నేపథ్యంలో, సంజీవ్ గోయెంకా ఆసక్తికరంగా స్పందించారు. ఓ ట్వీట్ తో వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారు. మైదానంలో తీవ్రతను, మైదానం బయట స్నేహాన్ని కోరుకుంటున్నాం... మా దృష్టి అంతా తర్వాతి మ్యాచ్ పైనే అంటూ తమ వైఖరిని స్పష్టం చేశారు. తద్వారానిన్నటి మ్యాచ్ లో ఓటమిని తాము పెద్దగా పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.