DeepSeek: వీ3 అప్ గ్రేడ్ తో అమెరికా ఏఐ మోడళ్లకు సవాల్ విసిరిన చైనా డీప్ సీక్

- డీప్‌సీక్ వీ3 ఏఐ మోడల్ కు తాజా అప్ గ్రేడ్ విడుదల లార్జ్ లాంగ్వేజ్ మోడల్ విడుదల.
- రీజనింగ్, కోడింగ్‌లో మెరుగైన సామర్థ్యాలు కనబరుస్తున్న వీ3
- డీప్ సీక్ నుంచి తక్కువ నిర్వహణ ఖర్చులతో ఆకర్షణీయమైన ఏఐ టూల్స్
ప్రఖ్యాత చైనా కృత్రిమ మేధ(AI) స్టార్టప్ డీప్‌సీక్, తమ సరికొత్త వీ3 ఏఐ మోడల్ ను మరింత అభివృద్ధి చేసింది. వీ3కి తాజాగా అప్ గ్రేడ్ ను విడుదల చేసింది. తద్వారా అమెరికా ఏఐ దిగ్గజాలు ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లకు సవాల్ విసిరింది. డీప్‌సీక్-V3-0324గా పిలువబడే ఈ నూతన మోడల్, ఏఐ అభివృద్ధి వేదిక అయిన హగ్గింగ్ ఫేస్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మార్కెట్‌లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు చైనా కంపెనీ డీప్ సీక్ ముమ్మరంగా కృషి చేస్తోంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఈ తాజా వీ3 మోడల్ రీజనింగ్ మరియు కోడింగ్ సామర్థ్యాలలో గణనీయమైన అభివృద్ధిని కనబరుస్తుంది. హగ్గింగ్ ఫేస్‌లో ప్రచురించిన బెంచ్‌మార్క్ పరీక్షలు, అనేక సాంకేతిక కొలమానాలు వీ3 మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్టు వెల్లడిస్తున్నాయి.
డీప్‌సీక్ ఇటీవల ప్రపంచ ఏఐ రంగంలో కొద్దికాలంలోనే ఒక గేమ్ చేంజర్ గా ఎదిగింది. పాశ్చాత్య కంపెనీలతో పోటీ పడే అనేక ఏఐ మోడళ్లను విడుదల చేసింది. డీప్ సీక్ ఏఐ మోడళ్ల నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డిసెంబర్‌లో వీ3 మోడల్‌ను విడుదల చేసిన డీప్ సీక్, జనవరిలో ఆర్1 మోడల్‌ను కూడా విడుదల చేసింది.