Rajendra Prasad: వార్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు... క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్

- 'రాబిన్‌హుడ్' ఈవెంట్‌లో వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు
- మాజీ క్రికెటర్‌ను ఉద్దేశించి నటకిరీటి చేసిన కామెంట్స్ వైరల్
- దీంతో ఆయనపై దుమ్మెత్తిపోసిన నెటిజన్లు
- ఈ వివాదం నేపథ్యంలో తాజాగా స్పందించిన రాజేంద్ర ప్రసాద్
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథిగా విచ్చేశాడు.
అయితే, రాబిన్‌హుడ్ ఈవెంట్‌లో వార్నర్‌పై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాజీ క్రికెటర్‌ను ఉద్దేశించి నటకిరీటి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో తాను వార్నర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తాను ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే సారీ అని అన్నారు.
"నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్లు అందరికీ నమస్కారం. మొన్న రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ మీద నా నోటి నుంచి అనుకోకుండా ఓ మాట దొర్లింది. అది నేను ఉద్దేశపూర్వకంగా చేసింది మాత్రం కాదు. నా గురించి మీకు తెలియనిది కాదు. ఆ ఫంక్షన్‌కి వచ్చే ముందు మేమంతా కలిసున్నాం. ఎంత అల్లరి చేశామంటే... నితిన్‌ని, అతడ్ని (వార్నర్ ని) మీరంతా నా పిల్లల్లాంటోళ్లు అన్నా.
అనేసి ఊరుకోకుండా నేను వార్నర్‌ని గట్టిగా వాటేసుకొని నువ్వు యాక్టింగ్‌లోకి వస్తున్నావ్‌గా రా నీ సంగతి చెప్తా అన్నా. దానికి మీరు క్రికెట్‌లోకి రండి మీ సంగతి చెప్తా అని వార్నర్ అన్నాడు. ఇలా చాలా అల్లరి చేసి ఆ ఫంక్షన్‌కి వచ్చాం. ఏది ఏమైనా ఐ లవ్ వార్నర్. ఐ లవ్ హిజ్ క్రికెట్. అలానే వార్నర్ మన సినిమాల్ని.. మన యాక్టింగ్‌ని చాలా ఇష్టపడతాడు.
నాకు తెలిసి మేము ఒకరికి ఒకరం బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన మీ మనసుల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. నేను ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు. అయినా కూడా నేను సారీ చెబుతున్నా. అలాంటిది ఇంకెప్పుడూ జరగదు. జరగకుండా చూసుకుందాం" అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.