Sunny Deol: బాలీవుడ్ నిర్మాతలు తెలుగు చిత్ర పరిశ్రమను చూసి నేర్చుకోవాలి: సన్నీ డియోల్

- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సన్నీ డియోల్
- ఏప్రిల్ 10న వస్తున్న 'జాట్'
- ప్రమోషన్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సన్నీ డియోల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ టాలీవుడ్‌లో స్థిరపడాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటీనటులను గౌరవించే విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.
సన్నీ డియోల్... టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'జాట్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్ ఈవెంట్ లో సన్నీడియోల్ మాట్లాడుతూ, టాలీవుడ్ నిర్మాతల నుంచి బాలీవుడ్ నిర్మాతలు ఎన్నో విషయాలు నేర్చుకోవాలని సూచించారు. దక్షిణాదిలో నటీనటులను గౌరవించే విధానం, సినిమా నిర్మాణంలో వారికున్న స్పష్టత బాలీవుడ్‌కు ఆదర్శనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
టాలీవుడ్‌తో కలిసి పనిచేయడం తనకు ఎంతో నచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉందని సన్నీడియోల్ అన్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో దర్శకులు చెప్పినట్లు నిర్మాతలు చేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, కమర్షియల్ అంశాలకే ప్రాధాన్యతనిస్తుండటంతో ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి కోల్పోయారని ఆయన విశ్లేషించారు.
సన్నీడియోల్ నటిస్తున్న 'జాట్' చిత్రంలో సయామీ ఖేర్, రెజీనా కథానాయికలుగా నటిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.