YS Sharmila: టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు: పెట్రో ధరలపై భగ్గుమన్న షర్మిల

- పొరుగు రాష్ట్రాల్లో కంటే ఏపీలో పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయన్న షర్మిల
- గతంలో 17 రూపాయలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారని వెల్లడి
- ఇప్పుడు అధికారంలో ఉన్నందున మాట నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు అని విమర్శించారు. ప్రతిపక్షంలో ఒక మాట... అధికారపక్షంలో మరో మాట... గత 10 ఏళ్లుగా ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందువరసలో పెట్టి... రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని షర్మిల మండిపడ్డారు.
"ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 109.60, డీజిల్ ధర రూ. 97.47గా ఉంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో పెట్రోల్ రూ. 100.86, డీజిల్ రూ. 92.39; కర్ణాటకలో పెట్రోల్ రూ. 102.90, డీజిల్ రూ. 88.99; తెలంగాణలో పెట్రోల్ రూ. 107.46, డీజిల్ రూ. 95.70గా ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం, ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోంది" అని షర్మిల వివరించారు.
చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు లీటరుకు రూ. 17 తగ్గించాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. గతంలో జగన్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై విమర్శలు చేసి, అధికారంలోకి వచ్చాక వాటిని పెంచారని గుర్తు చేసింది. రెండు పార్టీలు కలిసి ప్రజల నుంచి రూ. 50 వేల కోట్లు వసూలు చేశాయని ఆరోపించారు.
"కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంధనం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో సమాధానం చెప్పాలి. 17 రూపాయలు ధర తగ్గించి ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం" అని షర్మిల స్పష్టం చేశారు.