Vivek: మీ కుటుంబం హవా నడుస్తోంది!: వివేక్-మల్లారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ

- తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో వివేక్, మల్లారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ
- 'మంత్రి' అంటూ వివేక్‌ను సంబోధించిన మల్లారెడ్డి
- వివేక్, కోమటిరెడ్డి కుటుంబాల హవా నడుస్తోందన్న మల్లారెడ్డి
- కేసీఆర్, మల్లారెడ్డి కుటుంబాల హవా కూడా నడుస్తోందన్న వివేక్
తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివేక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. రాష్ట్రంలో మీ కుటుంబాల హడావుడి నడుస్తోందంటే, కాదు మీదే నడుస్తోందని ఇరువురు పరస్పరం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో వీరిద్దరు ఎదురుపడ్డారు. అక్కడ మల్లారెడ్డి, వివేక్‌ను 'మంత్రి' అంటూ సంబోధించారు. అందుకు వివేక్ ధన్యవాదాలు తెలిపారు.
"వివేక్ మొత్తానికి సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కంటే ముందే ఢిల్లీకి వెళ్లి వచ్చారు" అని మల్లారెడ్డి అన్నారు.
దానికి వివేక్ బదులిస్తూ తాను వేరే పని మీద వెళ్లి వచ్చానని చెప్పారు.
అయినా తెలంగాణలో వివేక్, కోమటిరెడ్డి కుటుంబాల హవా మాత్రమే నడుస్తోందని మల్లారెడ్డి నవ్వుతూ వ్యాఖ్యానించారు.
దానికి వివేక్ స్పందిస్తూ, కేసీఆర్, మల్లారెడ్డి కుటుంబాల హవా కూడా నడుస్తోంది కదా అని సమాధానం ఇచ్చారు.
ఇప్పుడు తమ హవా నడవడం లేదని మల్లారెడ్డి బదులిచ్చారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రికి విజ్ఞప్తి
14 ఏళ్లుగా పెండింగులో ఉన్న ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులను ప్రారంభించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఉపముఖ్యమంత్రి వెంటనే పనులు ప్రారంభించేందుకు రూ. 50 లక్షల నిధులను మంజూరు చేశారు.