Lavu Sri Krishna Devarayalu: ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ ఎంపీ

- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మించినది ఏపీలో మద్యం స్కామ్ అని పేర్కొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు
- లోక్ సభలో ఏపీ మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేసిన వైనం
- రూ.18వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించిపోయిందని, దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరపాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు.
లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టంతేనని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.99 వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగిందని, అందులో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని అన్నారు.
రూ.4 వేల కోట్లను బినామీల పేరుతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి అనే వ్యక్తి రూ.2 వేల కోట్ల రూపాయలను దుబాయ్‌కి తరలించారని ఆయన తెలిపారు. ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.