Pragati Yadav: పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

Wife Plots Husbands Murder Two Weeks After Wedding

  • ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో ఘటన
  • నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట
  • వారి ప్రేమను నిరాకరించి యువతికి బలవంతంగా పెళ్లి చేసిన తల్లిదండ్రులు
  • నిందితుల అరెస్ట్.. మిగతా వారి కోసం గాలింపు

పెళ్లయిన రెండు వారాలకే భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నిందో భార్య. ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు ప్రగతి యాదవ్(22), అనురాగ్ యాదవ్ ఇద్దరూ నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే, వీరి పెళ్లికి ప్రగతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న దిలీప్‌తో ప్రగతికి బలవంతంగా వివాహం జరిపించారు.

ఈ నెల 9న దిలీప్ బుల్లెట్ గాయాలతో ఓ పొలంలో పడి ఉండగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మరో మూడు ఆసుపత్రులకు తరలించారు. చివరికి ఔరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 20న మృతి చెందాడు.

మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. బాధితుడి భార్య, ఆమె ప్రియుడు కలిసి దిలీప్ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది. వివాహం తర్వాత ఇద్దరూ కలుసుకునేందుకు వీలు లేకపోవడంతో దిలీప్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షలు చెల్లించారు.

రామాజీ మరికొందరితో కలిసి బైక్‌పై దిలీప్‌ను పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ దిలీప్‌పై దాడి చేశారు. ఆ తర్వాత తుపాకితో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు తుపాకులు, నాలుగు లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పర్స్, ఆధార్‌కార్డు, రూ. 3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News