SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మరో మృతదేహం గుర్తింపు

- ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు
- ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం
- మరో ఆరు మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ లో సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపించింది. సహాయక చర్యల్లో 32వ రోజున టన్నెల్ లో మరో మృతదేహాన్ని గుర్తించారు. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో అక్కడ తవ్వకాలు చేపట్టారు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని బయటకు తీసుకురానున్నారు.
టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవసమాధి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను గుర్తించారు. మరో ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు జరుగుతోంది.
మరోవైపు, టన్నెల్ లో ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం సహాయక చర్యల్లో 700 మంది నిర్విరామంగా పని చేస్తున్నారు. ఇప్పుడు లభించిన మృతదేహం ఎవరిది అనేది నిర్ధారించి ప్రకటన చేయాల్సి ఉంది.