Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్ .. క్వార్ట్జ్ అక్రమ క్వారీయింగ్‌ కేసులో 4వ నిందితుడుగా చేర్పు

Kakani Govardhan Reddy Named in Illegal Mining Case

  • కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసు నమోదు
  • క్వార్డ్జ్ అక్రమ క్వారీయింగ్ కేసులో ఏ 4గా కాకాణి పేరు
  • కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తూ కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో జరిగిన అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలకు సంబంధించిన కేసులో కాకాణిని ఏ4గా చేర్చినట్లు సమాచారం. రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధమైన 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఈ అక్రమ మైనింగ్ వెనుక అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్‌పై చర్యలు లేకపోవడంతో కేంద్ర మైనింగ్ శాఖకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ అక్రమ క్వారీయింగ్ కేసులో కదలిక మొదలైంది.

తొలుత ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరులైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలపై కేసు నమోదు చేయగా, వీరు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. తాజాగా సోమవారం ఈ కేసులో కాకాణితో సహా మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఏ6, ఏ8గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని గూడూరు కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాలతో జైలుకు తరలించారు.

ఒకవైపు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగంట శ్రీనివాసులు రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించడం, మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా చేర్చడంతో కాకాణి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News