Zensho Holdings: సూప్ లో ఎలుక పడింది... రెస్టారెంట్ షేర్లు ఢమాల్!

- జపాన్‌లోని ప్రఖ్యాత జెన్షో హోల్డింగ్స్ కంపెనీ నిర్వహణలో కొనసాగుతున్న సుకియా రెస్టారెంట్లు
- సుకియా రెస్టారెంట్‌లో ఓ కస్టమర్ తిన్న సూప్ బౌల్‌లో చనిపోయిన ఎలుక అనవాళ్లు
- మార్చి 24న ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 7.1 శాతం మేర పతనం
సూప్‌లో ఎలుక పడిన ఘటనతో ఓ రెస్టారెంట్ షేర్లు భారీగా పతనం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కార్పొరేట్ సంస్థల్లో నిర్వహణ లోపాలు బయటపడితేనో, ఆ రంగంలో ప్రతికూల ప్రభావం చూపే వార్తలు వచ్చిన సందర్భాల్లోనో, లేదా త్రైమాసిక ఫలితాలు సరిగా లేకపోతేనో ఆ కంపెనీ షేర్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. కానీ జపాన్‌కు చెందిన జెన్షో హోల్డింగ్స్ కంపెనీ షేర్లు పతనానికి తమ ఆధీనంలోని ఓ రెస్టారెంట్‌లో కస్టమర్‌కు సర్వ్ చేసిన సూప్‌లో ఎలుక పడటం కారణం అయింది.
వాస్తవానికి జెన్షో గడచిన కొన్నాళ్లుగా బాగా రాణిస్తోంది. జపాన్ వ్యాప్తంగా సుమారు రెండు వేలకు పైగా సుకియా ఔట్‌లెట్లు ఉన్నాయి. గత ఏడాది షేరు 25 శాతం మేర పెరిగింది. ఇటీవల పెంచిన ధరల కారణంగా కంపెనీ మరిన్ని లాభాల్లోకి వస్తుందన్న అంచనాలతో దూసుకువెళుతున్న తరుణంలో దక్షిణ జపాన్‌లోని టొటొరి బ్రాంచ్‌లో ఓ కస్టమర్ తిన్న సూప్ బౌల్‌లో చనిపోయిన ఎలుక అవశేషాలు బయటపడటం ఆ కంపెనీకి శాపంగా మారింది.
ఈ ఘటన జనవరి 21న జరగ్గా మార్చి 22న వెలుగులోకి వచ్చింది. దీనిపై జెన్షో సంస్థ స్పందిస్తూ వండేటప్పుడు పొరపాటున జరిగిన ఈ ఘటనకు తాము చింతిస్తున్నామని ప్రకటన చేయడమే కాక, ఆలస్యంగా వెల్లడించినందుకు గానూ క్షమాపణలు కూడా తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటన వెలుగు చూసిన రెండు రోజుల్లో, అంటే మార్చి 24న ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 7.1 శాతం మేర షేర్లు పతనమయ్యాయి.