V Hanumantha Rao: డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది: వీహెచ్

- డీలిమిటేషన్ పై స్పందించిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్
- డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు
- అన్ని రాజకీయ పక్షాలు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా సంఘీభావం ప్రకటించాలన్న వీహెచ్
ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఇటీవల చెన్నైలో వివిధ రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది.
డీలిమిటేషన్‌ను మరో 25 ఏళ్లు స్తంభింపజేయాలని దక్షిణాది రాష్ట్రాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగి, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఎవరికీ నష్టం జరగని రీతిలో శాస్త్రీయ విధానం కనుగొనే వరకు డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై తాజాగా తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు స్పందించారు. దేశంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహించబోయే డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలు సంఘీభావం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.