IIT Bombay: ఐఐటీ బాంబే క్యాంపస్ లో హడలెత్తించిన మొసలి

- ఐఐటీ బాంబే క్యాంపస్ లోకి వచ్చిన భారీ మొసలి
- భయాందోళనకు గురైన విద్యార్థులు, అధ్యాపకులు
- సోషల్ మీడియాలో మొసలి వీడియో వైరల్
మహారాష్ట్రలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఒక భారీ మొసలి రోడ్డుపై సంచరించడం తీవ్ర కలకలం రేపింది. సమీపంలోని సరస్సు నుంచి క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఈ మొసలిని చూసి విద్యార్థులు, అధ్యాపకులు భయాందోళనలకు గురయ్యారు.
మొసలిని గమనించిన కొందరు భయంతో పరుగులు తీయగా, మరికొందరు తమ చరవాణిలో వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు, జంతు ప్రేమికులు సంఘటన స్థలానికి చేరుకుని మొసలి వల్ల ఎవరికీ ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత అది స్వయంగా పావై సరస్సులోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఐఐటీ బాంబేకి మొసలి కూడా చదువుకోవడానికి వచ్చి ఉంటుందని కొందరు సరదాగా వ్యాఖ్యానించగా, పావై సరస్సు సమీపంలో ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు సాధారణమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.