Mahesh Kumar Goud: ఖర్గే, రాహుల్ గాంధీతో మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలపై చర్చించాం: మహేశ్ కుమార్ గౌడ్

- అధిష్ఠానం పెద్దలతో గంటన్నర పాటు సమావేశం
- తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారని వెల్లడి
- కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చించామన్న మహేశ్ కుమార్ గౌడ్
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై చర్చించినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం గురించి పార్టీ అధిష్ఠానం అడిగి తెలుసుకుందని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పార్టీ అగ్రనేతలతో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి ఖర్గే, రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చించినట్లు తెలిపారు. అన్ని శాఖలపై సమగ్ర సమాచారాన్ని పార్టీ అధిష్ఠానం అడిగి తెలుసుకుందని ఆయన అన్నారు. త్వరలో అన్ని అంశాలపై ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.