HYDRAA: ప్రజావాణిలో హైడ్రాకు 63 ఫిర్యాదులు

- ప్రభుత్వ భూములు కాపాడాలంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు
- పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జా చేస్తున్నట్లు ఫిర్యాదులు
- పాఠశాలలు, పిల్లలు ఆడుకునే స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులు
హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూముల కోసం పని చేస్తున్న హైడ్రాకు ప్రజావాణిలో 63 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులను స్వీకరిస్తోంది. ఈ క్రమంలో, ప్రభుత్వ భూములు కాపాడాలంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.
ప్రజల అవసరాలకు ఉద్దేశించిన భూమిని స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జా చేస్తున్నారని, వాటిని కాపాడాలని పలువురు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాలలు, పిల్లలు ఆడుకునే స్థలాలను కూడా కొంతమంది కబ్జా చేసినట్లు ఫిర్యాదుల్లో ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని కోరుతున్నారు.
ఫుట్‌పాత్‌లను, సర్వీసు రోడ్డులను వదలకుండా తోపుడు బళ్ల నుంచి ఏకంగా డబ్బాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారని, వాటిని తొలగిస్తే ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు.
చెరువుల్లో వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే పరిమితమవ్వాల్సిన శిఖం భూములలో పక్కన పట్టా భూమి సర్వే నంబరు చూపించి అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టేస్తున్నారని ఫిర్యాదులందాయి. దీంతో తాము వ్యవసాయ భూమిని కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నారు.