Yash: ఆ కారణంతో ఎన్నో అవకాశాలు కోల్పోయా... పైగా పొగరనే ముద్ర కూడా వేశారు: హీరో యశ్

- 'కేజీఎఫ్', 'కేజీఎఫ్-2' చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన యశ్
- తన తర్వాతి ప్రాజెక్టుగా 'టాక్సిక్'తో బిజీ
- తాజాగా 'మనద కదలు' సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు
- ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసిన యశ్
'కేజీఎఫ్', 'కేజీఎఫ్-2' చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు కన్నడ స్టార్ నటుడు యశ్. ఇందులో రాకీ భాయ్ పెర్ఫార్మెన్స్ కు ఫిదా కాని సినీ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. అంతకుమించి అనేలా నటనతో పాన్ ఇండియా స్థాయిలో అందరినీ యశ్ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన తన తర్వాతి ప్రాజెక్టుగా 'టాక్సిక్'లో నటిస్తున్నారు.
అయితే, తాజాగా 'మనద కదలు' అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న సవాళ్లను యశ్ గుర్తు చేశారు. చాలా మంది దర్శక నిర్మాతలు తనకి పొగరనుకున్నారని, దాని ఫలితంగా ఎన్నో మంచి అవకాశాలు కోల్పోయానని చెప్పారు.
హీరో యశ్ మాట్లాడుతూ... "కెరీర్ ఆరంభంలో నటుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా కష్ట పడ్డా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అనుకునేవాడిని. ఈ క్రమంలో ఏదైనా ప్రాజెక్ట్ కోసం నన్ను కలిసిన దర్శకులను పూర్తి స్క్రిప్ట్ చెప్పాలని అడిగేవాడిని. అది కొంతమందికి నచ్చేది కాదు. దాంతో వారు నాకు పొగరనే ముద్ర వేశారు.
ఈ కారణంతో నేను ఎన్నో అవకాశాలు కోల్పోయా. అలాంటి సమయంలో నిర్మాత కృష్ణప్ప నాకు ఎంతో మద్దతిచ్చారు. నాపై నమ్మకం ఉంచారాయన. ఈ క్రమంలో దర్శకుడు శశాంక్ నాకు పూర్తి స్క్రిప్ట్ వివరించడంతో మోగ్గిన మనసు సినిమా సెట్ అయింది. ఇప్పటికీ నాకు ఆ చిత్ర బృందం అంటే ఎంతో గౌరవం" అని యశ్ చెప్పుకొచ్చారు.