KCR: కేసీఆర్ శాసనసభకు హాజరుకావడం లేదని గజ్వేల్ ప్రజలు పాదయాత్రతో వచ్చి ఫిర్యాదు చేశారు: రేవంత్ రెడ్డి

- గజ్వేల్ నుంచి నర్సారెడ్డి సారథ్యంలో వందలాది మంది వచ్చి తనను కలిశారన్న ముఖ్యమంత్రి
- వారు పాదయాత్రతో వచ్చి తనను కలిశారన్న రేవంత్ రెడ్డి
- కేసీఆర్ సభకు రాకపోవడంతో ప్రజాసమస్యలు ప్రస్తావనకు రావడం లేదని చెప్పారన్న సీఎం
మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ్యుడు కె. చంద్రశేఖర్ రావు శాసనసభకు హాజరుకాకపోవడం వల్ల తమ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు సభలో ప్రస్తావనకు రావడం లేదని గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు తనకు ఫిర్యాదు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి నర్సారెడ్డి సారథ్యంలో వందలాది మంది పాదయాత్రగా వచ్చి తనను కలిశారని ముఖ్యమంత్రి తెలిపారు. వారిని చూస్తే ఆనాడు గజ్వేల్ గడ్డపై నిర్వహించిన 'దళిత - గిరిజన దండోరా' కార్యక్రమం గుర్తుకువచ్చిందని ఆయన అన్నారు. కేసీఆర్ సభకు హాజరుకాకపోవడంతో తమ నియోజకవర్గ సమస్యలు సభలో చర్చకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు.
ప్రజా సమస్యల పట్ల నర్సారెడ్డి బాధతో, బాధ్యతతో వ్యవహరిస్తున్న తీరు అభినందనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. గజ్వేల్ పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ నియోజకవర్గం ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.