Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌!

IPL Ball Tampering Allegations Against CSK

  • నిన్న చెన్నైలో త‌ల‌ప‌డ్డ సీఎస్‌కే, ఎంఐ
  • ముంబ‌యిని 4 వికెట్ల తేడాతో ఓడించిన చెన్నై
  • 3 వికెట్లతో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ చేసిన ఖ‌లీల్ అహ్మ‌ద్
  • బౌలింగ్ వేసే స‌మ‌యంలో కెప్టెన్ రుతురాజ్‌కు ఏదో వ‌స్తువును ఇచ్చిన ఖ‌లీల్‌
  • ఆ వ‌స్తువుతో అత‌డు బాల్ ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోపిస్తున్న ఎంఐ ఫ్యాన్స్‌

ఐపీఎల్ 18వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఘనంగా ప్రారంభించింది. ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో ఆదివారం నాడు చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 

అయితే, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బాల్ ట్యాంపరింగ్‌కు పాల్ప‌డింద‌ని ఎంఐ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఆ జట్టు ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్ బాల్ టాంపరింగ్ చేశారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ అద్భుత ప్రదర్శనతో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. త‌న నాలుగు ఓవర్ల కోటాలో కేవ‌లం 29 పరుగులు మాత్ర‌మే ఇచ్చి, కీలకమైన మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ముంబ‌యి ఓపెనర్ రోహిత్ శర్మను డకౌట్ చేయడంతో పాటు మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. చివర్లో ట్రెంట్ బౌల్ట్ వికెట్ తీశాడు.

అయితే, ఖలీల్ తాను బౌలింగ్ వేసే సమయంలో సీక్రెట్‌గా తెచ్చిన వస్తువుతో బంతి ఆకారాన్ని మార్చాడ‌ని, ఆ తర్వాత ఆ వస్తువును కెప్టెన్ రుతురాజ్ కు అందజేశాడని ఎంఐ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఆ వ‌స్తువును క‌నిపించ‌కుండా రుతురాజ్ త‌న జేబులో వేసుకున్నాడ‌ని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై నెట్టింట‌ తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై విచారణ జరిపి సీఎస్‌కేపై బ్యాన్‌ విధించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఈ ఆరోపణలకు చెన్నై అభిమానులు తిప్పికొడుతున్నారు. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాద‌ని దీటుగా బ‌దులిస్తున్నారు. వీడియోలో ఖలీల్... రుతురాజ్‌ చేతికి ఏమిచ్చాడు అనేది స్పష్టంగా కనిపించడం లేదని, 'చూయింగ్ గమ్' ఇచ్చి ఉండవచ్చని అంటున్నారు. టీవీ అంపైర్ ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారని కౌంటర్ ఇస్తున్నారు.

More Telugu News