Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట!

- కొన్ని రకాల అలవాట్లు, పనులతో జ్ఞాపకశక్తిపై ప్రభావం
- తరచూ వాటిని అనుసరించడం వల్ల ఇబ్బందే అంటున్న శాస్త్రవేత్తలు
- వాటిని గుర్తించి మార్చుకోవడం మంచిదని సూచనలు
మన రోజువారీ జీవితంలో చేసే కొన్ని పనులు, కొన్ని రకాల అలవాట్లు, నిర్లక్ష్యం చేసే కొన్ని అంశాలు మన జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో మనపై ప్రభావం పడుతుందని ఏమాత్రం గుర్తించలేకుండా, మనకు తెలియకుండానే అనుసరిస్తూ ఉంటామని వివరిస్తున్నారు. ఈ పనులు, అలవాట్లను గుర్తించి, మార్చుకోవడం ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపర్చుకోవచ్చని సూచిస్తున్నారు. శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్న మేరకు జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపే అంశాలేమిటో తెలుసుకుందాం...
రాత్రి నిద్రకు ముందు సోషల్ మీడియా వాడకం...
చాలా మంది రాత్రి బెడ్ పైకి చేరగానే... ఫోన్ చేతిలోకి తీసుకుని ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ వంటివాటితో గడుపుతుంటారు. కానీ ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి రంగు కాంతి.. మనశరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుందని, నిద్రసరిగా పట్టదని, ఇది మెదడుపై ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడు చురుకుగా పనిచేయాలంటే... బెడ్ పైకి చేరడానికి కనీసం గంట ముందు నుంచే ఫోన్ స్క్రీన్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
మల్టీటాస్కింగ్ (ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడం)
కొందరు ఒకే సమయంలో వేర్వేరు పనులు (మల్టీ టాస్కింగ్) చేస్తూ ఉంటారు. ఇది కొంత వరకు మంచిదే అయినా... తరచూ గానీ, మరీ ఎక్కువగా గానీ మల్టీ టాస్కింగ్ చేస్తూంటే... ఏకాగ్రతపై, స్వల్పకాలిక మెమరీపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదడుపై ఎక్కువ ఒత్తిడి పడి, కొత్త జ్ఞాపకాలు స్టోర్ అవడానికి సమస్యగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఉద్వేగాలను అతిగా నియంత్రించుకోవడం...
తీవ్ర ఒత్తిడి, హాస్యం, ఇతర ఉద్వేగాలను అతిగా నియంత్రించుకోవడం వల్ల మెదడుపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా నియంత్రించుకున్నప్పుడు మెదడుపై ఒత్తిడి పెరిగి, కార్టిసాల్ హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుందని అంటున్నారు. ఇది మెదడులోని హిప్పోకాంపస్ భాగాన్ని దెబ్బతీసి, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు.
నిద్రకు ముందు అతిగా షుగర్ వాడటం
చక్కెర అతిగా ఉండే శీతల పానీయాలు, పళ్ల రసాలు, ఇతర డ్రింక్స్, స్వీట్లు వంటి వాటిని రాత్రి నిద్రకు ముందు తీసుకుంటే మెదడుపై ప్రభావం పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాత్రి నిద్రకు ముందు ప్రాసెస్డ్ షుగర్ ను అధికంగా తీసుకుంటే... మెదడులో ఇన్ ఫ్లమేషన్ ఏర్పడుతుందని, ఇది దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందని వివరిస్తున్నారు.
ఎక్కువ సేపు ఇంట్లోనే గడపడం...
చాలా మంది ఏమాత్రం సమయం దొరికినా ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటారు. టీవీ చూస్తూనో, మొబైల్ ఫోన్ తోనో గడుపుతుంటారు. ఇలాంటి వారు ఎండ తగలకుండా ఉంటారు. దీనితో వారిలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఇది మతిమరపు, డిమెన్షియా వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం...
మన శరీరంలో ఎక్కువ శక్తిని వినియోగించుకునేది మెదడే. రాత్రంతా గ్యాప్ తర్వాత ఉదయమే... మంచి పోషకాహారం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలా కాకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉండిపోతే... మెదడు పనితీరుపై ప్రభావం పడి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
జీపీఎస్ పై విపరీతంగా ఆధారపడటం...
తెలిసిన ప్రదేశమే అయినా, తెలియని చోటు అయినా పూర్తిగా జీపీఎస్ మీద ఆధారపడితే... మన మెదడులో స్పాషియల్ మెమెరీ బలహీనం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మన మెదడులోని హిప్పోకాంపస్ భాగం జ్ఞాపకశక్తికి, నావిగేషన్ సామర్థ్యానికి మూలమని వివరిస్తున్నారు. మనం సొంతంగా దారులు వెతుక్కుంటూ, ఆలోచిస్తూ వెళుతుంటే అది యాక్టివ్ గా మారుతుందని స్పష్టం చేస్తున్నారు.
సరిగా నీళ్లు తాగకపోవడం...
శరీరంలో నీటి శాతం సరిగా లేకపోతే... మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏకాగ్రత కోల్పోవడం, మతిమరపు, మగత, తలనొప్పి వంటి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని వివరిస్తున్నారు.