Tamim Iqbal: మైదానంలో బంగ్లా స్టార్ క్రికెటర్‌కు గుండెపోటు.. వెంటిలేటర్‌పై చికిత్స!

- బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు
- డీపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెటర్‌కు హార్ట్ ఎటాక్
- తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు సోమవారం సావర్‌లో ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) మ్యాచ్ సందర్భంగా మైదానంలో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతడ్ని హూటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
డీపీఎల్‌లో భాగంగా మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు నాయకత్వం వహిస్తున్న 36 ఏళ్ల బ్యాటర్ మైదానంలో ఉండగానే అకస్మాత్తుగా ఛాతీలో నొప్పితో బాధపడ్డాడు. దాంతో వైద్య సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
"అతను మొదట ఛాతీలో నొప్పిగా ఉందన్నాడు. దాంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి ఈసీజీ సహా ఇతర పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్‌కు వచ్చేందుకు రెడీ అవుతుండగా.. తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. వైద్యులు అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు చెప్పారు. ఫజిలాతున్నేసా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది " అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చీఫ్ ఫిజీషియన్ దేబాషీశ్ చౌదరి వెల్లడించారు.
ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే తమీమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం లీగ్ మ్యాచ్‌లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ, అప్పుడప్పుడు కామెంట్రీ చేస్తున్నాడు. అతడు బంగ్లా తరఫున 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.