Vidala Rajani: తప్పు చేయకుంటే ఉలికిపాటు ఎందుకు?: విడదల రజనిపై ప్రత్తిపాటి పరోక్ష వ్యాఖ్యలు

- గతంలో అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు
- దీని వెనుక ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కుట్ర ఉందన్న రజని
- నిజాయతీపరుడైన ఎంపీపై అవాకులు చెవాకులు పేలితే సరిపోతుందా? అంటూ ప్రత్తిపాటి ధ్వజం
పల్నాడు జిల్లాలో ఓ స్టోన్ క్రషర్స్ సంస్థ మేనేజ్ మెంట్ ను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు కావడం తెలిసిందే. అయితే తనపై పెట్టింది అక్రమ కేసు అని, దీని వెనుక టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కుట్ర ఉందని విడదల రజని ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకుని విడదల రజనిని పరోక్షంగా ప్రశ్నించారు. అవినీతికి పాల్పడలేదనప్పుడు రాయబారాలు ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు అని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.
నిజాయతీపరుడైన ఎంపీ మీద అవాకులు చెవాకులు పేలితే సరిపోతుందా? గతంలో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి నేడు నీతులు చెబుతుండడం ఆశ్చర్యంగా ఉంది అని వ్యాఖ్యానించారు. నాడు అధికార గర్వంతో అరాచకాలు చేసి, ఇప్పుడు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోంది అంటూ విమర్శించారు.