Abhishek Mahanti: తెలంగాణ నుంచి అప్పటి వరకు రిలీవ్ చేయవద్దు: ఐపీఎస్ అధికారి మహంతికి హైకోర్టులో ఊరట

- ఏపీలో రిపోర్టు చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు
- క్యాట్‌లో విచారణ తేలేవరకు రిలీవ్ చేయవద్దన్న హైకోర్టు
- మహంతి పిటిషన్‌ను త్వరగా విచారించాలని క్యాట్‌కు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్‌లో విచారణ తేలే వరకు తెలంగాణ నుంచి ఆయనను రిలీవ్ చేయవద్దని కోర్టు ఆదేశించింది.
తెలంగాణలో ఐపీఎస్‌గా విధులు నిర్వహిస్తోన్న అభిషేక్ మహంతిని ఏపీలో రిపోర్టు చేయాలని గత నెలలో డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అభిషేక్ మహంతి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ని ఆశ్రయించారు. డీవోపీటీ, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ క్యాట్ విచారణను వాయిదా వేసింది.
డీవోపీటీ ఉత్తర్వుల మేరకు మహంతి మార్చి 20వ తేదీలోపు ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. మహంతి పిటిషన్‌ను త్వరగా విచారించాలని క్యాట్‌ను హైకోర్టు ఆదేశించింది.