YS Jagan: ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశాం: జగన్

Jagan Free Crop Insurance Implemented as Farmers Right

  • కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తేసింది
  • రైతు భరోసా నిధులూ ఇవ్వలేదని మాజీ సీఎం ఆరోపణ
  • సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టిందని మండిపడ్డ జగన్

ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షం కారణంగా పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు. ఉదయం వైఎస్సార్ జిల్లా తాతిరెడ్డిపల్లికి జగన్ చేరుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో పంట బీమాను రైతుల హక్కుగా అమలుచేశామని చెప్పారు. రైతు భరోసా నిధులు క్రమం తప్పకుండా అందించామని గుర్తుచేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక పంట బీమాకు మంగళం పాడారని విమర్శించారు. గత ఏడాదికి చెందిన రైతు భరోసా నిధులను విడుదల చేయకుండా ఆపేసిందని మండిపడ్డారు. రైతు భరోసా కాదు తాము అధికారంలోకి వచ్చాక రైతుకు రూ.26 వేలు అందిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు 26 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. ‘కళ్లు మూసుకుంటే ఏడాది గడిచిపోయింది. మళ్లీ కళ్లుమూసుకుని తెరిస్తే మూడేళ్లు గడిచిపోతాయి. రైతు సోదరులకు ఒకటే చెబుతున్నా.. మూడేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం.

ఇప్పుడు పెండింగ్ లో పెట్టిన నిధులను విడుదల చేస్తాం. ఇన్ పుట్ సబ్సిడీతో పాటు పంట బీమా, రైతు భరోసా నిధులు అందజేస్తాం’ అని జగన్ చెప్పారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉందని గుర్తుచేస్తూ.. అయినప్పటికీ పార్టీ తరఫున రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడతామని వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు పంట బీమా డబ్బులు అందించేలా చూస్తామన్నారు. అదేవిధంగా, వైసీపీ తరఫున కూడా ఎంతోకొంత సాయం అందించే ప్రయత్నం చేస్తామని మాజీ సీఎం జగన్ రైతులకు హామీ ఇచ్చారు.


YS Jagan
Pullivendula
AP
Crop Insurance
Farmer's Rights
Rythu Bharosa
Input Subsidy
Agriculture
AP Politics
Chandrababu Naidu

More Telugu News