KTR: అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కేటీఆర్ ఫైర్

- 'ఎక్స్' వేదికగా కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ విమర్శలు
- రాష్ట్ర ప్రజలు తాగునీటికి గోస పడుతున్నారని ఆవేదన
- వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి అంటూ కేటీఆర్ ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉందని దుయ్యబట్టారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పల్లెలు నాడు ప్రగతి బాట పడితే... నేడు 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధోగతి బాట పట్టాయని విమర్శించారు.
14 నెలలుగా సర్పంచులు లేక కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 12,754 గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు.
రాష్ట్ర ప్రజలు తాగునీటికి గోస పడుతున్నారని, వీధి దీపాలు వెలగని పరిస్థితి అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో దేశానికే అదర్శంగా నిలిచి అవార్డులు అందుకున్న తెలంగాణ పల్లెలు... నేడు కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యంతో నిధులు లేక వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.