Vidala Rajani: చేసేవన్నీ చేసి.. ఇప్పుడు బుకాయింపులా?: విడదల రజనిపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫైర్

- కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధిక ధర చెల్లించి తాము భూములు తీసుకున్నామన్న కృష్ణదేవరాయలు
- ఐపీఎస్ అధికారులను కూడా రజని బెదిరించారని మండిపాటు
- అక్రమాలు చేసి.. రెడ్ బుక్ అని బుకాయిస్తున్నారని ఎద్దేవా
స్టోన్ క్రషర్ యజమాని నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలపై విడదల రజని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించారని, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తన ఫోన్ డేటాను కూడా తీసే ప్రయత్నం చేశారని చెప్పారు.
ఈ క్రమంలో రజనికి శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. తాను కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని... ఫోన్ డేటా, భూముల విషయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. 40 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నామని... తమది మచ్చలేని చరిత్ర అని చెప్పారు. అమరావతిలో స్థలం కోసం కూడా తాము దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూములు వేలం వేస్తే తాము అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నామని చెప్పారు. భూముల వేలానికి, భూముల కేటాయింపులకు మధ్య ఉన్న తేడా ఏమిటో తెలుసుకోవాలని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వులపాలు అవుతారని చెప్పారు. విడదల రజని అబద్ధాలు మాట్లాడుతున్నారని... ఆమె మాదిరి తాను అబద్ధాలు మాట్లాడలేనని అన్నారు.
రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విడదల రజని అంటున్నారని... ఆ వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఐపీఎస్ అధికారి జాషువా సర్వీసు 2040 వరకు ఉందని... ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో తనకు, బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానికి మధ్య ఎలాంటి బంధుత్వం లేదని చెప్పారని తెలిపారు. 2021 ఆగస్ట్ 24న మీ (విడదల రజని) నుంచే ఫిర్యాదు వచ్చిందని.. ఆ స్టోన్ క్రషర్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని మీరే చెప్పారని అన్నారు. ఐపీఎస్ అధికారులను బెదిరించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. అక్రమాలు మీరు చేసి... ఇప్పుడు రెడ్ బుక్ అంటూ బుకాయింపులా? అని మండిపడ్డారు.
మీ స్వార్థం కోసం అధికారులను కూడా బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడదల రజని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తాను ఫిర్యాదు చేసినట్టు ఆమె చెబుతున్నారని... పోతారం బాషా, ఎంపీపీ శంకర్ రావు, ముత్తా వాసు, గోల్డ్ శీను, అబ్బాస్ ఖాన్, నాగయ్య వద్ద విడదల రజని డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని చెప్పారు. కేసును ఆపమని విడదల రజని రాయబారం పంపింది నిజం కాదా? అని ప్రశ్నించారు.