Red Wine: రెడ్ వైన్ నిజంగా ఆరోగ్యకరమేనా.. తాజా పరిశోధన ఏంచెబుతోందంటే..?

- మద్యం ఏ రూపంలో ఉన్నా ముప్పు పొంచి ఉంటుందన్న శాస్త్రవేత్తలు
- వైట్ వైన్ తో మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు
- అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో వెల్లడి
మద్యం ఏ రూపంలో ఉన్నా సరే ఆరోగ్యానికి హానికరమేనని తాజా పరిశోధనలో తేలింది. రెడ్ వైన్ ఆరోగ్యకరమనే వాదనను తోసిపుచ్చింది. ఈమేరకు అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం ప్రకారం.. రెడ్ వైన్ ఆరోగ్యకరమనే వాదనకు ఎలాంటి ఆధారం లభించలేదు. రెడ్ వైన్ లోని రెస్ వెరట్రాల్ సహా ఇతరత్రా యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే అభిప్రాయం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ యాంటీఆక్సిడెంట్లతో మేలు జరుగుతుందని కానీ, క్యాన్సర్ ముప్పు తగ్గుతోందని కానీ చెప్పలేమన్నారు. తమ పరిశోధనలో గట్టి ఆధారాలు ఏవీ లభించలేదన్నారు.
ఇప్పటి వరకు జరిపిన 42 అధ్యయనాలలో వెల్లడైన డేటాను నిశితంగా పరిశీలించాక ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన యున్‌యంగ్ చో పేర్కొన్నారు. అదేసమయంలో వైట్ వైన్ వల్ల మహిళల్లో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని గుర్తించినట్లు తెలిపారు. వైట్ వైన్ తరచుగా తాగే మహిళల్లో చర్మ క్యాన్సర్ ముప్పు 22 శాతం పెరుగుతోందన్నారు. కాగా, రోజువారీ జీవితంలో సూర్యకాంతికి ఎక్కువ గురికావడం సహా ఇతరత్రా అలవాట్లు కూడా ఈ ముప్పు పెరగడానికి కారణం కావచ్చని వివరించారు.