Young Woman: హైదరాబాద్ లోకల్ ట్రైన్ లో అత్యాచారయత్నం.. ట్రైన్ నుంచి దూకిన యువతి

- లోకల్ ట్రైన్ లో యువతిపై యువకుడు అత్యాచారయత్నం
- ట్రైన్ నుంచి దూకేయ్యడంతో గాయపడిన యువతి
- గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితురాలు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
లోకల్ ట్రైన్ లో ఒక దుర్ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఒక యువతిపై ఒక యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది.
మేడ్చల్‌లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన యువతి తన సెల్ ఫోన్ రిపేరు కోసం సికింద్రాబాద్ వెళ్లి, పని ముగిసిన తర్వాత తిరిగి లోకల్ ట్రైన్ లో బయలుదేరింది. ఆమె మహిళా కోచ్‌లో ప్రయాణిస్తుండగా, ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్‌లో దిగిపోయారు. ఆ తర్వాత బోగీలో ఒంటరిగా ఉన్న ఆమెపై ఒక యువకుడు (25) అత్యాచారయత్నం చేయబోయాడు.
దీంతో ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు కొంపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద రైలు నుంచి దూకింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.