Ruturaj Gaikwad: చెన్నైదే పైచేయి.. ముంబైని మట్టి కరిపించిన గైక్వాడ్ సేన

Chennai Super Kings Beat Mumbai Indians by 4 Wickets

  • రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్
  • తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటిన బౌలర్లు నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్
  • చెన్నైని గెలుపు తీరాలకు చేర్చిన రచిన్ రవీంద్ర

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా గత రాత్రి ముంబై ఇండియన్స్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ పరుగుల వేటలో తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగుల ఓ మాదిరి స్కోరు చేసింది. 

అనంతరం 156 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు), కెప్టెన్ రుతురాజ్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు) చెలరేగడంతో విజయం సునాయాసమైంది. లక్ష్య ఛేదనలో తొలుత 78/1తో బలంగా కనిపించడంతో విజయం నల్లేరుమీద నడకేనని భావించారు. అయితే, ఆ తర్వాత ముంబై బౌలర్లు పుంజుకోవడంతో చెన్నై ఒత్తిడిలో పడింది. 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రచిన్ రవీంద్ర వికెట్ల వద్ద పాతుకుపోవడంతో విజయం ఆ జట్టు సొంతమైంది. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైని చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్, పేసర్ ఖలీల్ అహ్మద్ ఇద్దరూ ఇబ్బంది పెట్టారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ జట్టుపై ఒత్తిడి పెంచారు. చెన్నైకి తొలిసారి ఆడుతున్న వీరిద్దరూ ముంబై బ్యాటర్ల భరతం పట్టారు. ఫలితంగా 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై ఇబ్బందుల్లో పడింది. ఖలీల్ 3 వికెట్లు, నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసుకుని ముంబై ఇండియన్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ముంబై జట్టులో తిలక్ వర్మ చేసిన 31 పరుగులే అత్యధికం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29, దీపక్ చాహర్ 28 పరుగులు మాత్రమే చేశారు. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నూర్ అహ్మద్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News