Chandrababu Naidu: వడగళ్ల వానతో పంట నష్టం.... ఆరాతీసిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Reviews Crop Loss Due to Hailstorms in Andhra Pradesh

  • రాయలసీమ జిల్లాల్లో వడగళ్ల వానలు
  • అనంతపురంలో రైతుల ఆత్మహత్యాయత్నం
  • మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
  • పంట నష్టంపై సమీక్ష

అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టపోయి తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో జరిగిన ఈ సంఘటనపై ఆయన జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో భాగంగా, ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. మరింత మెరుగైన చికిత్స కోసం వారిని అనంతపురం తరలించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా జరిగిన పంట నష్టంపై సమగ్ర సమీక్ష జరిపారు. కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లోని 40 గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు నివేదించారు. దాదాపు 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వారు వివరించారు.

క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైతులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News