Hollywood Celebrities: గూగుల్, ఓపెన్ ఏఐపై మండిపడుతున్న హాలీవుడ్ సెలెబ్రిటీలు... ఎందుకంటే...!

Hollywood Stars Slam Google  OpenAI Over AI Copyright Concerns

  • అమెరికా ఏఐ లో ముందుండాలంటే కాపీరైట్ చట్టాలను సడలించాలంటున్న టెక్ సంస్థలు
  • గూగుల్, ఓపెన్ ఏఐ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బాలీవుడ్ తారలు
  • ట్రంప్ ప్రభుత్వానికి బహిరంగ లేఖ

ప్రముఖ హాలీవుడ్ నటులు, దర్శకులు, సంగీతకారులు, రచయితలతో సహా 400 మందికి పైగా కళాకారులు ట్రంప్ ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఏఐ శిక్షణ కోసం సినిమాలు, పాటలు, టీవీ సిరీస్ లు, సంగీతం, కళారూపాలకు సంబంధించిన కాపీరైట్ చట్టాలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్న గూగుల్, ఓపెన్ ఏఐలను అడ్డుకోవాలని కోరారు. అమెరికా ప్రభుత్వానికి లేఖ రాసిన వారిలో నటులు బెన్ స్టిల్లర్, మార్క్ రఫాలో, గాయకుడు పాల్ మెక్ కార్ట్ నీ తదితరులు ఉన్నారు. 

ఏఐ మోడల్స్ ను మరింత అభివృద్ధి చేసుకునే క్రమంలో కాపీరైట్ చట్టాలను బలహీనపరిచే ప్రయత్నాలు సరికాదని వారు అభిప్రాయపడ్డారు. దీనివలన సృజనాత్మక పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి టెక్ సంస్థలు సంస్థలు వినోద రంగానికి చెందిన కాపీరైట్ చట్టాలను సడలించాలని గత కొంతకాలంగా కోరుతున్నాయి. అమెరికా ఏఐ రంగంలో మరింత ముందుండాలంటే కాపీరైట్ చట్టాలను సడలించాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నాయి. అయితే, ఈ ప్రయత్నాలను హాలీవుడ్ కళాకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

కాపీరైట్లను బలహీనపరిస్తే అమెరికా ఆర్థిక, సాంస్కృతిక బలం దెబ్బతింటుందని వాదిస్తున్నారు. అమెరికా వినోద రంగం 2.3 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోందని, సంవత్సరానికి 229 బిలియన్ డాలర్ల వేతనాలను అందిస్తోందని వారు తమ లేఖలో పేర్కొన్నారు.  

గూగుల్ (2 ట్రిలియన్ డాలర్ల విలువ), ఓపెన్ ఏఐ (157 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ) వంటి టెక్ దిగ్గజాలు తమ ఆదాయాలు, నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, అమెరికా సృజనాత్మక, మేధో పరిశ్రమలను ఉచితంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక మినహాయింపు కోరుతున్నాయని వారు విమర్శించారు.

  • Loading...

More Telugu News