Ishan Kishan: ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ... చరిత్ర సృష్టించే అవకాశం జస్ట్ మిస్సయిన సన్ రైజర్స్

Ishan Kishans Super Century Sunrisers Just Miss Historic IPL Score

  • సన్ రైజర్స్ తరఫున తొలిసారిగా ఆడుతున్న ఇషాన్ కిషన్
  • 47 బంతుల్లో 106 నాటౌట్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసిన సన్ రైజర్స్
  • గతేడాది 287/3 స్కోరుతో ఐపీఎల్ లో అత్యధిక స్కోరు రికార్డు నమోదు చేసిన ఎస్ఆర్ హెచ్
  • నేడు రెండు పరుగుల తేడాతో ఆల్ టైమ్ రికార్డు మిస్

ఐపీఎల్ సీజన్లు మారినా, సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడులో మార్పే లేదు. ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు గత సీజన్ లో బౌలర్లను ఎలా చీల్చిచెండాడారో, ఈ సీజన్ లోనూ అదే విధంగా ఆడుతున్నారు. ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ నేడు రాజస్థాన్ రాయల్స్ తో తొలి మ్యాచ్ ఆడుతుండగా... తొలి మ్యాచ్ లోనే ప్రకంపనలు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించే అవకాశాన్ని రెండు పరుగుల తేడాతో మిస్సయింది. 

ఈ సీజన్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించిన వేళ... సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు 287/3. ఇది సన్ రైజర్స్ నమోదు చేసిన రికార్డే. గత సీజన్ లో ఆర్సీబీపై ఈ ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. అయితే తన రికార్డును తానే బ్రేక్ చేసే అవకాశాన్ని సన్ రైజర్స్ నేడు చేజార్చుకుంది. అయినప్పటికీ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు రికార్డు నమోదు చేసింది. 

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ విధ్వంసం ఓ రేంజిలో సాగింది. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ స్కోరులో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అత్యంత వేగంగా బౌలింగ్ చేస్తాడని పేరున్న ఇంగ్లండ్ సీమర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో వరుసగా  రెండు సిక్స్ లు కొట్టడం హైలైట్ గా నిలిచింది. 

మరో ఎండ్ లో ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు చేయగా... మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 11 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేశాడు. తెలుగుతేజం నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 30 పరుగులు... హెన్రిచ్ క్లాసెన్ 14 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 34 పరుగులు చేసి స్కోరుబోర్డు స్పీడ్ తగ్గకుండా చూశారు. 

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3, మహీశ్ తీక్షణ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆర్చర్ బౌలింగ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్నారు. పోటీలు పడి సిక్సులు కొట్టారు. 

  • Loading...

More Telugu News