Bhagat Singh: భగత్ సింగ్ కు మోదీ, చంద్రబాబు నివాళి

- నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరికంబం ఎక్కిన రోజు
- 1931 మార్చి 23న వీరిని ఉరి తీసిన బ్రిటీష్ ప్రభుత్వం
- ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుందామన్న చంద్రబాబు
- వీరి పేర్లు వింటేనే గుండె గర్వంతో నిండిపోతుందన్న మోదీ
స్వాతంత్ర్య సమరవీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన సంగతి తెలిసిందే. వారు ప్రాణత్యాగం చేసిన షహీద్ దివస్ సందర్భంగా వారికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. భారత జాతికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించడానికి 23 ఏళ్ల వయసులోనే వీరోచిత పోరాటాలు చేసి యువ హృదయాలపై చెరగని ముద్ర వేసిన స్వాతంత్ర్య సమరవీరులు అని చంద్రబాబు కొనియాడారు. ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుంటూ వారికి నివాళి అర్పిద్దామని చెప్పారు.
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ప్రధాని మోదీ కూడా నివాళి అర్పించారు. వీరి పేర్లు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుందని చెప్పారు. ఈ ముగ్గురూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భరతమాత కోసం పోరాడారని అన్నారు. ఈ త్యాగమూర్తులను ఈరోజు దేశం స్మరించుకుంటోందని చెప్పారు.
1931 మార్చి 23న ఈ ముగ్గురినీ బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది. బ్రిటీష్ అధికారి శాండర్స్ ను హత్య చేయడం, పార్లమెంట్ లో బాంబులు వేయడం వంటి కారణాలు చూపుతూ ఈ ముగ్గురినీ ఉరి తాశారు. ఈ ఘటన భారత స్వాతంత్ర్య పోరాటాన్ని తీవ్రతరం చేసింది. వీరి ప్రాణత్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది మార్చి 23న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు.