Sunrisers Hyderabad: ఉప్పల్ లో నేటి ఐపీఎల్ మ్యాచ్ కు భారీగా భద్రతా ఏర్పాట్లు

- ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
- తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ × రాజస్థాన్ రాయల్స్
- 2,700 మంది పోలీసులతో కట్టుదిట్టంగా బందోబస్తు
- ఎంట్రన్స్ గేట్ వద్ద స్నిఫర్ డాగ్స్, బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు
ఇవాళ ఆదివారం కావడంతో ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఆడుతున్నాయి.
ఇక, మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే సన్ రైజర్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ పోలీస్ విభాగం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. 2,700 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు కల్పించారు.
స్టేడియం ఎంట్రన్స్ గేట్ వద్ద స్నిఫర్ డాగ్స్, బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేపడుతున్నారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, అగ్గిపెట్టెలు, ఎలక్ట్రానిక్ డివైస్ లను తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. ఉప్పల్ స్టేడియం, పరిసరాల్లో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలనకు స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మ్యాచ్ నేపథ్యంలో... ఉప్పల్ స్టేడియం వద్ద 5 పార్కింగ్ ప్రదేశాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే రోజుల్లో మైట్రో రైళ్లను అర్ధరాత్రి వరకు నడపాలని నిర్ణయించారు.