Merchant Navy Officer Murder: భోజనం వద్దు.. మాకు గంజాయే కావాలి.. జైల్లో మర్చంట్‌ నేవీ అధికారి హంతకుల వింత ప్రవర్తన!

Merchant Navy Officer Murder Killers Bizarre Behavior in Jail

  • మీరట్‌లో భార్య, ఆమె ప్రియుడి చేతిలో సౌరభ్‌ రాజ్‌పుత్ అనే మర్చంట్ నేవీ అధికారి దారుణ హత్య
  • ఈ కేసులో అరెస్టయిన అధికారి భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్
  • వారిద్దరూ డ్ర‌గ్స్‌కు బానిసలుగా మారారన్న పోలీసులు
  • జైలుకు వచ్చినప్పటి నుంచి అవి లేకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నారని వెల్ల‌డి

యూపీలోని మీరట్‌లో భార్య, ఆమె ప్రియుడి చేతిలో సౌరభ్‌ రాజ్‌పుత్ అనే మర్చంట్ నేవీ అధికారి దారుణ హత్యకు గురైన విష‌యం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన అధికారి భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్ జైల్లో వింతగా ప్రవర్తిస్తున్నార‌ని తాజాగా పోలీసులు తెలిపారు. 

వారిద్దరూ డ్ర‌గ్స్‌కు బానిసలుగా మారారని, జైలుకు వచ్చినప్పటి నుంచి అవి లేకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నారని వెల్ల‌డించారు. నిందితులు ఇద్దరు ప్రతిరోజు మాదకద్రవ్యాల ఇంజెక్షన్లు తీసుకుంటారని గుర్తించామని, అవి లేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. 

జైల్లో పెట్టిన భోజ‌నం కూడా తినడం లేదని జైలు అధికారులు తెలిపారు. తమకు గంజాయి కావాలని, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని అడుగుతున్నారని చెప్పారు. జైలుకు వచ్చినప్పటి నుంచి నిందితుల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టిందని తెలిపారు. 

దాంతో సాహిల్‌ను ఆస్పత్రికి తరలించగా అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించాడని, గంజాయి ఇవ్వాలని డిమాండ్ చేసిన‌ట్లు పేర్కొన్నారు. మానసికస్థితి సరిగా లేకపోవడంతో వారు తోటి ఖైదీలపై దాడి చేసే అవకాశం ఉండడంతో వారిని స‌ప‌రేట్ గా ఉంచినట్లు తెలిపారు.

హత్య సమయంలోనూ సాహిల్‌ డ్రగ్స్‌ మత్తులోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారిని జైలులోని డీ అడిక్షన్‌ సెంటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కాగా, సౌరభ్‌ రాజ్‌పుత్‌(29), ముస్కాన్‌(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్‌ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో ఒక పాప పుట్టింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్‌ (25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

విషయం సౌరభ్‌ రాజ్‌పుత్‌కు తెలియడంతో వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. కానీ, కూతురు కోసం సౌరభ్‌ వెనక్కి తగ్గాడు. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయాడు. అయితే, గతనెల కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. భ‌ర్త‌ అలా తిరిగి రావ‌డం న‌చ్చ‌ని ముస్కాన్‌.. ప్రియుడితో కలిసి హత్య చేసింది. సౌరభ్‌ శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్‌ చేసింది. మృతుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News