Indians: అమెరికాలో ఘోరం.. భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను తుపాకీతో కాల్చి చంపిన దుండ‌గుడు!

Father and Daughter from India Shot Dead in US Store

  • అమెరికాలోని వర్జీనియాలో దారుణ ఘ‌ట‌న‌
  • మద్యం కొనేందుకు వెళ్లి తండ్రీకూతుళ్లపై కాల్పుల‌కు పాల్ప‌డ్డ ఆగంత‌కుడు 
  • గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్, ఆయ‌న‌ కుమార్తె ఊర్మి మృతి

అమెరికాలో ఘోరం జ‌రిగింది. డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను ఓ దుండ‌గుడు తుపాకీతో కాల్చి చంపేశాడు. వర్జీనియాలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లోకి గ‌న్‌తో చొరబడిన దుండ‌గుడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. 

ఈ కాల్పుల్లో గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్ (56), ఆయ‌న‌ కుమార్తె ఊర్మి (24) తీవ్రంగా గాయపడ్డారు. ప్రదీప్ ఘటనాస్థలిలోనే మృతిచెంద‌గా.. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఊర్మి చనిపోయినట్టు పోలీసులు వెల్ల‌డించారు. నిందితుడు జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్ (44)ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

గురువారం ఉదయం మద్యం కొనుగోలు చేసేందుకు డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కు వెళ్లిన నిందితుడు.. ముందురోజు రాత్రి త్వరగా ఎందుకు మూసేశారని ప్రశ్నించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ప్రదీవ్ పటేల్, ఊర్మిపై కాల్పులకు తెగ‌బ‌డ్డాడు. గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాకు చెందిన ప్రదీప్ పటేల్.. తన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ తన బంధువు పరేశ్‌ పటేల్‌కు చెందిన డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు.

పరేశ్ పటేల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. "మా సోదరుడి భార్య, ఆమె తండ్రి షాపులో పనులు చేసుకుంటుండగా ఒక వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడు. ఏం జరిగిందో నాకు తెలియదు"అని అన్నారు. హతుడు ప్రదీప్ పటేల్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిలో ఒకరు అహ్మదాబాద్ లో, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు. ఈ జంట హత్యలు అమెరికాలోని భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. 

  • Loading...

More Telugu News