Supreme Court Notice: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం.. తెలంగాణ స్పీకర్ కు సుప్రీం నోటీసులు

- కాంగ్రెస్ లో చేరిన పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు
- స్పీకర్ స్పందించడంలేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ గతంలోనూ నోటీసులు ఇచ్చింది. ఇందుకు సుప్రీంకోర్టు గడువు కూడా విధించింది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ప్రజలు కారు గుర్తుపై గెలిపించాక పార్టీ మారడం వారి నమ్మకాన్ని వమ్ము చేయడమేనని బీఆర్ఎస్ విమర్శించింది.
దీనిపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ను ఆదేశించాలని కోరింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22లోగా స్పందించాలని ఆదేశిస్తూ విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. అయితే, గడువు ముగిసినా తెలంగాణ స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది.