Childhood Memories: బాల్య జ్ఞాపకాలు పెద్దయ్యాక గుర్తుండకపోవడానికి కారణం ఇదేనట.. తాజా పరిశోధనలో వెల్లడి

- మూడేళ్ల వయసులో నేర్చుకునే సామర్థ్యం చాలా ఎక్కువని తేల్చిన గత పరిశోధనలు
- రిట్రైవల్ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందకపోవడమే కారణం
- జర్నల్ సైన్స్ పరిశోధనా పత్రంలో వెల్లడి
బాల్యం.. ప్రతీ ఒక్కరికీ ఓ అద్భుతమైన జ్ఞాపకం. చిన్నతనంలోనే బాగుండేదని అనుకోని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. అయితే, చిన్నతనంలో ఏం జరిగింది, ఏంచేశామనే వివరాలు సాధారణంగా ఎవరికీ గుర్తుండవు. మూడు నాలుగేళ్ల వయసులో ఏంచేశాం, ఎలా ఆడుకున్నామనే విషయం ఎంత ప్రయత్నించినా గుర్తుతెచ్చుకోలేం. దీనికి కారణమేంటనే విషయంపై జర్నల్ సైన్స్ తాజాగా ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. వాస్తవానికి చిన్నతనంలో.. అంటే మూడేళ్లలోపు చిన్నారులకు నేర్చుకునే సామర్థ్యం అత్యధికంగా ఉంటుందని గతంలో చాలా పరిశోధనల్లో వెల్లడైంది. మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకునే సామర్థ్యం ఎక్కువని తేలింది.
ఆ వయసులో ర్యాపిడ్ లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆ వయసులో జరిగిన సంఘటనలు మాత్రం బాల్యంలో, పెద్దయ్యాక గుర్తుండవని అన్నారు. దీనికి కారణం మూడు నాలుగేళ్ల వయసులో జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడమేనని తేల్చారు. ఈమేరకు 25 మంది చిన్నారులపై జరిపిన పరీక్షలో ఈ విషయం వెల్లడైందని వివరించారు. ఈ చిన్నారులకు ఫంక్షనల్ మాగ్నెటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎంఆర్ఐ) పరీక్ష చేశామని చెప్పారు. ఈ పరీక్షలో చిన్నారులు తాము చూసిన, గమనించిన విషయాలను జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటున్నారని తేలిందన్నారు. అయితే, జ్ఞాపకశక్తికి సంబంధించి మెదడులో కీలకమైన భాగం హిపోకాంపస్ పూర్తిగా అభివృద్ధి చెందని కారణంగా పెద్దయ్యాక బాల్య జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకోవడం సాధ్యం కావడంలేదని శాస్త్రవేత్తలు వివరించారు.