IPL 2025: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ధోనీ-హార్దిక్ పాండ్య వైరల్ వీడియో!

- నేడు చెన్నై వేదికగా ఎంఐ, సీఎస్‌కే మ్యాచ్
- ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో ఇరుజట్ల ప్రాక్టీస్
- మైదానంలో ధోనీని చూసి ఆప్యాయంగా హత్తుకున్న హార్దిక్
- నెట్టింట వీడియో వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ శనివారం ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో కేకేఆర్, ఆర్‌సీబీ తలపడ్డాయి. ఇందులో ఆర్‌సీబీ అద్భుత విజయంతో బోణీ కొట్టింది. ఇక ఇవాళ డబుల్ ధమాకా ఉంది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్, రాజస్థాన్ తలపడనుండగా, రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) పోటీ పడనున్నాయి. సీఎస్‌కే, ఎంఐ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
దీంతో ఇప్పటికే ఎం.ఏ. చిదంబరం స్టేడియానికి చేరుకున్న ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మైదానంలో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య, చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు.
ఎంఎస్‌డీని చూసిన హార్దిక్ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.