Stalin: దక్షిణాది పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు: స్టాలిన్ పై బీజేపీ లక్ష్మణ్ ఫైర్

- డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న స్టాలిన్
- ప్రాంతీయత పేరుతో స్టాలిన్ కుట్రలు చేస్తున్నారన్న లక్ష్మణ్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపాటు
కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై స్టాలిన్ అధ్యక్షతన నిన్న చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి పలువురు సీఎంలు, కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ... ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మనం బతకాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ నేపథ్యంలో స్టాలిన్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాల పేరుతో స్టాలిన్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ కేంద్రంలోని బీజేపీని విమర్శిస్తున్నారని... ప్రాంతీయత పేరుతో కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కూడా లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనాలను సాధించేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు వేర్వేరు కాదని అన్నారు. భవిష్యత్తులో ఎదిగేందుకు బీఆర్ఎస్ తో కాంగ్రెస్ చేతులు కలిపిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.