Sunny Yadav: యూట్యూబర్ సన్నీ యాదవ్‌పై లుక్ అవుట్ నోటీసు

- సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 5న కేసు నమోదు
- తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
- ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయంచిన సన్నీ యాదవ్!
యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సన్నీ యాదవ్‌పై సూర్యాపేట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. బైక్ రైడర్ అయిన సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జిల్లాలోని నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 5న అతడిపై కేసు నమోదైంది. ప్రస్తుతం అతడు విదేశాల్లో ఉన్నాడు.
సన్నీ యాదవ్ వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్ దాటి వెళ్లినట్టు అనుమానిస్తున్న పోలీసులు ఈ నోటీసులు జారీచేశారు. లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో అతడు ఇండియాలో అడుగుపెట్టగానే ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేయనున్నారు. సన్నీ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నాడు. అవి చూసిన యువత బెట్టింగ్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాదు, ఈ ప్రమోషన్ల ద్వారా అతడు బాగానే సంపాదించినట్టు చెబుతున్నారు.
బెట్టింగ్ యాప్‌లపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పోరాటంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. సన్నీ యాదవ్‌పై నూతన్‌కల్ పోలీసులు 111(2), 318(4), 46 ఆర్/డబ్ల్యూ 61(2), బీఎన్ఎస్ 3, 4, టీఎస్‌జీఏ 66-C, 66-D , ఐటీఏ 2000-2008 చట్టం కింద కేసులు నమోదు చేశారు.
తనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ముందస్తు బెయిలు కోసం సన్నీ యాదవ్ తన లాయర్ల ద్వారా కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. మరోవైపు, పోలీసులు మాత్రం అతడి కోసం గాలిస్తూనే ఉన్నారు.