MS Dhoni: 50 ఏళ్ల వయసులో సచిన్ అద్భుతంగా ఆడుతున్నాడు కదా.. ధోనీ రిటైర్మెంట్ వార్తలపై చెన్నై కెప్టెన్

- ఐపీఎల్‌లో ధోనీకి ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందన్న రుతురాజ్ గైక్వాడ్
- 50 ఏళ్ల వయసులో ఇంటర్నేషన్ మాస్టర్స్ లీగ్‌లో సచిన్ ఆటతీరును ప్రస్తావించిన కెప్టెన్
- 43 ఏళ్ల వయసులో ధోనీ ఏం చేసినా గొప్పగా ఉంటుందన్న గైక్వాడ్
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై కొంతకాలంగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, ఇదే విషయమై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ధోనీ రిటైర్మెంట్‌పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 50 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని, కాబట్టి ఐపీఎల్‌లో ధోనీకి ఇంకా కొన్ని సంవత్సరాల క్రికెట్ మిగిలి ఉందని చెప్పుకొచ్చాడు.
ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో సచిన్ ఆటతీరును ప్రస్తావించిన రుతురాజ్.. సచిన్ కొన్ని మ్యాచుల్లో అసాధారణ షాట్లు ఆడినట్టు గుర్తుచేశాడు. ఈ సీజన్‌లో ఇండియా మాస్టర్స్ జట్టును విజయాల బాటలో నడిపించాడని ప్రశంసించాడు. ఫైనల్ మ్యాచ్‌లోనూ రెండు అద్భుతమైన షాట్లు ఆడాడని గుర్తు చేశాడు.
బ్యాటింగ్‌లో తన పాత్ర కోసం ధోనీ ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నట్టు గైక్వాడ్ చెప్పాడు. గత రెండు సీజన్లలో ధోనీ 8వ స్థానానికి పరిమితమయ్యాడని, మ్యాచ్ చివరి రెండు ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని వివరించాడు. 43 ఏళ్ల వయసులో ధోనీ ఏం చేసినా అది గొప్పగా ఉంటుందని తాను భావిస్తున్నట్టు రుతురాజ్ పేర్కొన్నాడు. జట్టు కోసం అతడు కీలక ఇన్నింగ్స్ ఆడుతాడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ధోనీ గత సీజన్‌లో 220 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ సహా ఇతర జట్లపై విజయానికి కారణమయ్యాడు.
ఐపీఎల్ కోసం సన్నాహాలు జరుగుతున్నప్పుడు తన రిటైర్మెంట్‌పై ధోనీ మిశ్రమ సంకేతాలు ఇచ్చాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాబోయే కొన్ని సంవత్సరాలపాటు క్రికెట్‌ను ఆస్వాదించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. కానీ, ఆ తర్వాత ‘వన్ లాస్ట్ టైమ్’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు పెంచాడు. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన గైక్వాడ్.. ధోనీ రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టాడు. కాగా, ఐపీఎల్‌లో భాగంగా నేడు చెన్నైలో ముంబై ఇండియన్స్ జట్టుతో సీఎస్‌కే తలపడనుంది.