Murali Krishna: భూ వివాదంలో టాలీవుడ్ నిర్మాతపై ఆరోపణలు!

- సంగారెడ్డి జిల్లా గొంగ్లూరు గ్రామంలో భూ వివాదం
- సినీ నిర్మాత మురళీకృష్ణ అనుచరులు తనపై దాడి చేశారంటూ క్రాంతి అనే రైతు ఫిర్యాదు
- జోగిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు క్రాంతి
నరసింహనాయుడు సినిమా నిర్మాత మురళీకృష్ణ భూ వివాదంలో చిక్కుకున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామంలో క్రాంతి అనే వ్యక్తితో మురళీకృష్ణకు గత కొన్ని సంవత్సరాలుగా భూవివాదం కొనసాగుతోంది.
ఈ క్రమంలో తన పొలానికి కంచె వేస్తుండగా, మురళీకృష్ణ అనుచరులు అడ్డుకుని తనపై దాడి చేశారని రైతు క్రాంతి ఆరోపించారు. పొలం అమ్మితే మురళీకృష్ణకే అమ్మాలని, లేకుంటే చంపేస్తామని అతని అనుచరులు హెచ్చరించారని ఆయన తెలిపారు.
జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రాంతి ఈ ఘటనపై మురళీకృష్ణ, అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
సినీ నిర్మాతగా ఉన్న మురళీకృష్ణపై తీవ్ర ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.