Sri Venkateswara Swamy Temple: తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

Amaravati to Get a Majestic Sri Venkateswara Swamy Temple

  • ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన ముఖద్వారం, ఏడంతస్తుల్లో మహారాజ గోపుర నిర్మాణం
  • రూ. 185 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
  • శ్రీవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తిరుమలను తలపించేలా శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజ గోపురం, మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితోపాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు.

రాజధాని నిర్మాణ పనులతోపాటు సమాంతరంగా ఆలయ నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. ఇందుకోసం రూ. 185 కోట్లు ఖర్చు చేయనున్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని ఏడేళ్ల క్రితమే అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వెంకటపాలెం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి, కృష్ణా కరకట్టకు మధ్యలో 25 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. రూ. 150 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు 2018లో టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం కూడా తెలిపింది.

పనులు ప్రారంభించిన కొన్నాళ్లకే వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. రూ. 150 కోట్లు ఖర్చు చేస్తామన్న టీటీడీ అంచనా వ్యయాన్ని రూ. 36 కోట్లకు పరిమితం చేయడంతో ప్రధాన ఆలయం, లోపలి ప్రాకారం, ఒక రాజగోపురం, ధ్వజస్తంభ మండపాల నిర్మాణంతో సరిపెట్టింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆలయ నిర్మాణానికి ముందడుగు పడింది.

  • Loading...

More Telugu News