Vidala Rajini: మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదు

- శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ. 2.2 కోట్లు వసూలు చేసినట్టు రజినిపై అభియోగాలు
- విచారణ అనంతరం ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసిన ఏసీబీ
- ఏ1గా రజిని, ఏ2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, ఏ3గా రజినీ మరిది గోపి
పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ. 2.2 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని సహా అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరికొందరిపై ఏసీబీ కేసు నమోదైంది.
ఈ కేసులో రజినిని ఏ1గా, పల్లె జాషువాను ఏ2గా, రజిని మరిది గోపిని ఏ3గా, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా చేర్చారు. రజిని బెదిరింపులు, అక్రమ వసూళ్లపై గతంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీశ్‌కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ చేయించిన దర్యాప్తులో ఆధారాలు లభించడంతో నిన్న కేసు నమోదు చేశారు.