Virat Kohli: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

- నాలుగు జట్లపై 1000కిపై పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ
- కేకేఆర్‌పై 1000కిపైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా విరాట్
- భారత్ తరపున 400 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా బెంగళూరు స్టార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ 16.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతాపై 1000 పరుగులు పూర్తిచేసుకోవడంతోపాటు నాలుగు జట్లపై 1000కిపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), ఢిల్లీ కేపిటల్స్ (డీసీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లపై కోహ్లీ 1000కిపైగా పరుగులు చేశాడు. అలాగే, కేకేఆర్‌పై 1000 పరుగులు చేసిన మూడో ఆటగాడిగానూ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ (1093), రోహిత్ శర్మ (1070) పరుగులు చేశారు.
ఇక, టీ20 క్రికెట్‌లో కోహ్లీకి ఇది 400వ మ్యాచ్ కావడం గమనార్హం. భారత్ తరపున 400 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత ఆటగాడిగానూ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (448), దినేశ్ కార్తీక్ (412) కోహ్లీ కంటే ముందున్నారు. ఇక కోహ్లీ నాలుగు జట్లపై 1000కిపైగా పరుగులు సాధించగా, డేవిడ్ వార్నర్ కేకేఆర్, పీబీకేఎస్‌పై, రోహిత్ శర్మ కేకేఆర్, డీసీపై, శిఖర్ ధావన్ సీఎస్‌కేపై 1000కిపైగా పరుగులు సాధించారు.