Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తున్నాం... రోడ్లు కూడా ఖాళీగా ఉంటున్నాయి: చామల కిరణ్ కుమార్ రెడ్డి

MP Kiran Kumar Reddy comments on KTR Padayatra

  • పదేళ్లు బయటకు రాని వారు ఇప్పుడైనా రావడం మంచిదేనని వ్యాఖ్య
  • దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ మద్దతు ఉందన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణ
  • చెన్నైలో దొంగల ముఠా సమావేశమైతే పోలీసులను ఎందుకు పంపించలేదని బండి సంజయ్‌కి ప్రశ్న

బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేపడతామని ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. పాదయాత్రను స్వాగతిస్తున్నామని, రోడ్లు కూడా ఖాళీగానే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు బయటకు రాకుండా కనీసం ఇప్పుడైనా రావడం మంచిదే అన్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ మద్దతు ఉందని, అందుకే డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన సమావేశానికి రేవంత్ రెడ్డి వెళ్లారని తెలిపారు. పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కేటీఆర్ ప్రశంసించారని, కానీ అంతకుముందే లేఖలు రాసిన జానారెడ్డి, భట్టివిక్రమార్కను ప్రశంసించడానికి ఆయనకు నోరు రావడం లేదని విమర్శించారు.

మెట్రో విస్తరణపై కూడా తాము లేఖలు రాశామని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదని ఆరోపించారు. కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా మాత్రమే కాదని, బీజేపీ అధ్యక్షుడిగా కూడా చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి కావాలని ఆయనకు ఉంటుందని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

కొత్త ప్రభుత్వానికి కనీసం మూడేళ్ల సమయం ఇవ్వాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2026లో జనగణన జరిగితే, 2027లో పునర్విభజన జరుగుతుందని, అందుకే స్టాలిన్ ముందుగా అప్రమత్తమయ్యారని వెల్లడించారు. చెన్నైలో జరిగిన సమావేశంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చిల్లర మాటలని మండిపడ్డారు. అక్కడ సమావేశమైంది దొంగల ముఠానే అయితే హోంశాఖ సహాయ మంత్రిగా పోలీసులను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలను పక్కన పెట్టి ఆలోచన చేయాలని హితవు పలికారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అనే విషయాన్ని అందరూ గుర్తించాలని సూచించారు. హరీశ్ రావు పాజిటివ్ లైన్‌లోకి వచ్చారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి అందరికీ ముఖ్యమంత్రి అని గ్రహించి, సమస్యల పరిష్కారం కోసం ఆయనను కలిశారని తెలిపారు.

  • Loading...

More Telugu News