Pawan Kalyan: కొణిదెల గ్రామ అభివృద్దికి రూ.50 లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

- నేడు కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
- కొణిదెల గ్రామాభివృద్దికి అన్ని విధాలా సహకరిస్తానని వెల్లడి
- గతంలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామ అభివృద్ధి కోసం రూ.50 లక్షలు ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లా పూడిచర్లలో ఫాం పాండ్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే పై ప్రకటన చేశారు.
కాగా, పవన్ కల్యాణ్ ఇంటి పేరు కొణిదెల అని తెలిసిందే. అయితే పవన్ ఇంటి పేరుకు, ఈ కొణిదెల గ్రామానికి సంబంధం లేదు. పవన్ స్వస్థలం ఈ కొణిదెల గ్రామం కాదు. అయినప్పటికీ, కొణిదెల పరిస్థితి గురించి సర్పంచి ద్వారా తెలుసుకున్న పవన్ ఈ ఊరిని దత్తత తీసుకున్నారు.
తన సొంత ట్రస్టు నుంచి రూ.50 లక్షల నిధులను ఈ గ్రామానికి కేటాయించారు. ఎమ్మెల్యేతో మాట్లాడి కొణిదెల గ్రామానికి ఏం అవసరమో అవన్నీ చేస్తానని, అధికారులకు చెప్పి ప్రభుత్వ పథకాలన్నీ ఈ ఊరి ప్రజలకు అందేలా చూస్తానని పవన్ కల్యాణ్ ఇవాళ హామీ ఇచ్చారు.
గ్రామంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే కొణిదెల గ్రామంలో పర్యటిస్తానని తెలిపారు.